…ఎందుకో మా శివయ్యకి… ఒకటి తగ్గింది…

                   

                     …ఎందుకో మా శివయ్యకి… ఒకటి తగ్గింది…

                                                              



సంవత్సరానికి పదుల సంఖ్యలో పండుగలు ఉన్న మా శివయ్యకు మాత్రం శివరాత్రి ఒక్కటే అందుకే మా శివయ్యకు ఒకటి తగ్గింది. అన్ని పండుగలకు ఉదయాన్నే లేచి స్నానమాచరించి కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెట్టి ఒక నమస్కారం పెట్టి తండ్రి మమ్మల్ని దీవించు అని కోరిక కోరితే సరిపోతుంది. కానీ మా శివయ్య శివరాత్రి రోజు జాగారం చేయమంటాడు. శివయ్య జాగారం చేయమంటే మాకు లేనిపోని అలసట వస్తుంది అదే మిగతా రోజుల్లో అయితే చరవాణి చేతిలో పట్టుకొని రాత్రి 12 దాకా ఉంటాం, కానీ నిద్ర రాదు. బహుశా జీవితంలో ఒక్క శివరాత్రి శివయ్యకు దగ్గరగా జరుపుకోవాలని నాకు రాసి పెట్టలేదేమో. ఈ కలియుగంలో ఫ్యాషన్ ,టెక్నాలజీ ,ఒకరితో ఒకరికి సంబంధంలేని మానవ జీవితాలు, బండ రాళ్లను పగలగొట్టి ఆ కాంక్రీట్ తో చేసిన నివాసాలలో నివసించి గుండెలు కూడా బండరాళ్లయ్యాయి శివ. అందుకే దైవ భక్తి చింతనలో మేము వెనుకబడ్డాము తండ్రి. 

ఆ దైవభక్తి  ఒక్కటి శివయ్యకు తగ్గింది. 


మేము ఎంత మూర్ఖులం అంటే తండ్రి ఒంటి నిండా నగలు ధరించి కొత్త పుంతలతో తయారవుతున్న దుస్తులను ధరించి నాలుగు దైవ వాక్యాలు చెప్పేవారిని నమ్ముతాము. కానీ శివయ్య నీవేమో పులి చర్మం ఏనుగు చర్మం కప్పుకొని ఉంటావు, మెడకు నాగశేషున్ని చుట్టుకుని ఉంటావు, చేతిలో త్రిశూలం పట్టుకుని ఉంటావు ఇంకో చేతిలో డమరుని పట్టుకొని ఉంటావు చల్లదనం కోసం చందమామని నెత్తిన పెట్టుకుంటావు అలాగే గంగమ్మ కొప్పును చుట్టి పెట్టుకున్నావు మెడలో బ్రహ్మ కపాల మాలలు ధరించి ఉంటావు . ఈ టెక్నాలజీతో కూడుకున్న ప్రపంచంలో నువ్వు అలా ఉంటే ఎవరు చూస్తారు శివయ్య నిన్ను. తమరు అలా ధరించి ఉండటం  వెనకాల ఉన్న అంతరార్థ పరమార్థాలను మేము గుర్తించలేని అజ్ఞాన హినులం తండ్రి.

 అది నా శివయ్యకు తగ్గింది. 


మేము ఎంత మూర్ఖులం అంటే తండ్రి ,ఈ సృష్టి ఆది నుంచి తమరు ఉన్నారు,  బ్రహ్మను సృష్టించి ప్రతి సృష్టి చేయమన్నారు ఇలాంటి ఎంతమంది బ్రహ్మలు కాల గర్భంలో కలిసిపోయారూ, నేను మొదటి సృష్టించిన వ్యక్తి అతను కూడా కాలగర్భంలో కలిసిపోతే బాగుండదని చెప్పి కపాలాలన్ని మెడలో నువ్వు గుర్తుగా ధరిస్తావు తండ్రి. అంతటి కరుణామూర్తివి తండ్రి. అది మేము గుర్తించలేదు.

అందుకే మా శివయ్యకు ఒకటి తగ్గింది. 


శివయ్య బూడిద పూసుకొని బస్మాన్ని ఒంటినిండా రాసుకొని స్మశానంలో ఆనంద తాండవం చేస్తూ  ఉంటావు. అలా నిన్ను చూసిన మాకు భయమేస్తుంది శివయ్య. అలా తమరు ఎందుకు ఉంటారో తెలియని అజ్ఞానులం తండ్రి. మానవ జీవితం బతికున్నప్పుడు సోకులు, ఆడంబరాలు, మిత్రులు,  తండ్రి ,అమ్మ ,నాన్న, భార్య, పిల్లలు ఈ బంధుత్వ బాంధవ్యాలకు లోనై ఈ తిరుగుతూ, తను శివైక్యం చెందే రోజుకొచ్చినప్పుడు నువ్వు గుర్తొస్తావు తండ్రి. అంటే మరణించిన తరువాత నావారు నా కొడుకు నా బిడ్డలు నా భార్య మా నాన్న అని జబ్బులు చరుచుకొని విర్రవీగిన వారంతా స్మశాన వాటికకు చేరి కొడుకు తలకొరివి పెట్టగానే బూడిద అయిపోయిన తర్వాత అప్పుడు భయమేస్తుంది తండ్రి దేవుడా నన్ను రక్షించు నన్ను కాపాడు అని ఆర్తనాధలు చేస్తుంది నా ఆత్మ, అప్పుడు నువ్వు కావాలి తండ్రి. అప్పుడు నాతో మాట్లాడే వారు ఎవరు ఉండరు నా బాధలు చెప్పుకోవడానికి  నేను, నాది, నా బంధువులు, నా బిడ్డలనుకున్న వాళ్ళు ఎవరు నా తోడు రారు, నా బాధలన్నీ నీతో చెప్పుకుంటాను శివయ్య. కాటి కాపరివాడు స్మశాన వాటికకు తాళాలు వేసి ఇంటికి బయలుదేరి వెళ్లిన తర్వాత మా ఆత్మలన్నీ లేచి ఘోషిస్తుంటాయి తండ్రి అలా ఘోషిస్తున్న ఆత్మలను శాంతిపరచడానికి ఆ స్మశానంలో ఆనంద శివతాండవం చేస్తూ , ఉగ్ర భూతాలుగా తయారైన మా ఆత్మలన్నీ ఊరిలోకి రాకుండా నువ్వు మమ్మల్ని సదా రక్షిస్తున్నావు తండ్రి. చనిపోయిన తర్వాత గాని గుర్తు రాలేదు శివయ్య …

అందుకే మా శివయ్య ఒకటి తగ్గింది. 


డబ్బు అన్నింటినీ శాసిస్తుంది శివయ్య, తమరి దర్శనార్థం వచ్చినప్పుడు నాకు సకల సదుపాయాలన్నీ ఉండాలి బస్సులో ఇలా కూర్చోగానే తమరి గర్భగుడిలో అడుగుపెట్టే లాగా ఉండాలి ఎందుకంటే నా దగ్గర డబ్బు ఉంది, నువ్వేమో  కనీస సదుపాయాల లేని మారుమూల కొండలలో కోనలలో కొండ  చరియ ప్రాంతాలలో ఉంటావు. నా దగ్గరున్న ఈ డబ్బుతో టికెట్ కొనగలను గాని, తమరి కరుణా కటాక్ష వీక్షణలను ఎన్ని కోట్లు ఇచ్చినా పొందలేను కదా తండ్రి.

అందుకే మా శివయ్యకు ఒకటి తగ్గింది.


 ఆ కొండ కోనల్లో ఉన్న నీ దర్శనార్ధం కాలినడకన మనదేలిన బండరాలను తొక్కుకుంటూ, ముళ్ళ పొదలను చీల్చుకుంటూ, ఆకాశాన్ని అంటే వృక్షాల మాట నా సేదతీరుతూ, దారి పొడవునా శివ నామ జపం చేస్తూ, ఓం నమశ్శివాయ అనే పంచాక్షరి ని పలుకుతూ, గోధులితో ఉన్న మేము మీ పాద దూలిని తాకినంత మాత్రాన మా జన్మలు ధన్యం తండ్రి. బడలికతో ఆకలి దప్పికలతో వచ్చిన మమ్మల్ని చూసి తమరు మా అమ్మ పార్వతీ వంక చూడగానే  మా అమ్మ అన్నపూర్ణాదేవి కదా మా ఆకలి ఇట్టే తీరుస్తుంది. ఇంకా గంగమ్మ మా దాహార్తిని తీరుస్తుంది. మా తండ్రి గణేశుడు శ్రావ్యమైన సంగీతాన్ని వినిపిస్తుంటే, మా తండ్రి సుబ్రహ్మణ్యేశ్వరుడి వాహనం నెమలి నాట్యం చేస్తుంది. ప్రతిరోజు ఆ యాంత్రికమైన జీవితంలో ఎందుకు గడుపుతారు. కాసేపు ప్రకృతి అడవి సుందర దృశ్యాలు చూస్తారు అని ఆ కొండకోనలలో ఉన్నావా తండ్రి. ఎంతటి  దయామయుడువి తండ్రి. ఇది మేము గుర్తించలేదు.

అందుకే మా శివయ్యకు ఒకటి తగ్గింది. 

తండ్రి శివయ్య మాకు ఎంతటి కండ కావరం అంటే తండ్రి, సంవత్సరం మొత్తం తమరి దర్శనం చేసుకోము, సరే నా పిల్లలే లే ఏదో పని ఉండి రాలేదు లే అనుకొని, తమరు మా బసవయ్య వాహనం ఎక్కి ఊరేగింపుగా మా ఇంటి ముందర నుంచే వెళ్తారు, నేను నా దైనందిన కార్యక్రమాలలో నా చెరవాని నొక్కుకుంటూ, పనికిమాలినవన్నీ చూస్తూ ఉంటాను. అయినా కూడా నన్ను నీ బిడ్డగానే చూస్తావు తండ్రి. మరీ ఇంత మంచితనం పనికిరాదేమో మంజునాథ. తమరు ఎంతటి భోళాశంకర్లు తండ్రి. 

అందుకే మా శివయ్యకి ఒకటి తగ్గింది…


శ్రీశైల మల్లన్న… 

అరుణాచలేశ్వర… 

శ్రీకాళహస్తీశ్వర…

 తమరి పూజకు నేను విదేశాల నుండి సుగంధ భరిత పరిమళ పుష్పాలను, సుగంధ భరిత చందనాలను, దేశంలో ఉన్న నదులన్నిటిలోని నీటిని తేనెక్కర్లేదు.

ఒక చుక్క నీటిని పోసి

చిటికెడు బూడిద రాసి

ఒక మారేడు దళాన్ని ఉంచి

ఓం నమశ్శివాయ అని నామస్మరణ చేస్తే

 ఎంతో పొంగిపోతావు తండ్రి. నా తల్లి పార్వతమ్మతో, చూడు పార్వతి మన బిడ్డ ఎంత బాగా పూజ చేస్తున్నాడో అని. అంతటి చిన్న భక్తికి నువ్వు పొంగిపోతావు శివయ్య. అది కూడా చేయలేని నేను ఎంతటి దౌర్భాగ్యుడునో...

అందుకే మా శివయ్యకి ఒకటి తగ్గింది...


కాశీ విశ్వేశ్వర...

మీ నామస్మరణకు నేను గ్రాంధిక పదాలనే పలకనక్కర్లేదు.

తమరు శివ అన్న పలుకుతారు, 

లింగ అన్న పలుకుతారు, 

అరుణాచలేశ్వర అన్న పలుకుతారు, 

శ్రీశైల మల్లన్న అన్న పలుకుతారు, 

శ్రీకాళహస్తీశ్వర అన్న పలుకుతారు,

 భీమేశ్వర అన్న పలుకుతారు, 

మహా కాలేశ్వర అన్న పలుకుతారు, 

ఏ పేరును పిలిచినా తమరు పలుకుతారు తండ్రి. మీ పేరుని నోరార పలకలేని నేను ఎంతటి దుష్టుడనో తండ్రి.

అందుకే మా శివయ్యకు ఒకటి తగ్గింది.


                                        అందుకే మా శివయ్యకి ఒకటి తగ్గింది...

                                        అందుకే మా శివయ్యకు ఒకటి తగ్గింది...

                                        అందుకే మా శివయ్య ఇంకొకటి తగ్గింది

 మా శివయ్యకు ఒకటి కాదు 

ఎన్నో వందలు తగ్గాయి, 

వేలు తగ్గాయి, 

లక్షల తగ్గాయి, 

కోట్లు తగ్గాయి

కానీ శివయ్యకు నా మీదున్న ప్రేమ

ఇసుమంతైనా తగ్గలేదు


నా ఈ రాత …నా ఈ మాట

నా ఈ భాష … నా ఈ ఘోష

సర్వం ఉమామహేశ్వర కటాక్షం.


నా ఈ వ్యధ… నా ఈ బాధ

నా ఈ రోదన… నా ఈ ఆవేదన

సర్వం ఆ  అరుణాచలేశ్వరుని ఆజ్ఞ.


ఇహం శివం, అహం శివం, పరం శివం,

 సర్వం శివం, శివనామ స్మరణం

జన్మజన్మల పాపహరణం.

ఈ సర్వం శివార్పణం.


ఓం నమశ్శివాయ 

ఓం నమశ్శివాయ 

ఓం నమశ్శివాయ

 ఓం నమశ్శివాయ 

ఓం నమశ్శివాయ.


తప్పులు ఏమన్నా ఉన్నా… 

నేను తప్పుగా ఏదైనా మాట్లాడిన… 

నన్ను క్షమించు తండ్రి.

                                                                                             ,,,, నీ బిడ్డ.... రాజు నాయక్.

Comments

Popular posts from this blog

సీతాకోకచిలుక...

⛅ ఓ... మేఘమాల...⛅